కాల్‌మనీ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Aug 21, 2025 - 11:20
 0  15.2k
కాల్‌మనీ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎసిఎఫ్ & ఎచ్‌ఆర్ కోఆర్డినేటర్ డా. రాయవరపు సత్యభామ

గుంటూరు/తాడేపల్లి : పేదల బలహీనతలను ఆసరా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న కాల్‌మనీ నిర్వాహకులపై ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని ఎసిఎఫ్ & ఎచ్‌ఆర్ కోఆర్డినేటర్ డా. రాయవరపు సత్యభామ డిమాండ్‌ చేశారు.

ఇటీవల నులకపేటలో కాల్‌మనీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కృష్ణప్రియ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కాల్‌మనీ గుండాలపై దాడి చేసి గట్టి శిక్షలు పడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆమె మాట్లాడుతూ –

  • రాష్ట్రం నలుమూలలా ముఖ్యంగా మహిళలపై కాల్‌మనీ వ్యాపారం కరాళ నృత్యం చేస్తోందని,

  • రూ.50 వేలు అప్పు తీసుకుంటే రోజుకు రూ.500–1,000 వడ్డీ చెల్లించాల్సి వస్తోందని,

  • అప్పు తీర్చినా వేధింపులు ఆగడం లేదని,

వివరించారు.

కృష్ణప్రియ ఘటన ఈ దారుణానికి ఉదాహరణ అని, ఆమె రూ.50 వేలు అప్పు తీసుకుని ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించినా, ఇంకా రూ.7.5 లక్షలు ఇవ్వాలని దుండగులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. “డబ్బులివ్వకుంటే చంపుతాం” అనే స్థాయికి కాల్‌మనీ గ్యాంగులు వెళ్లారని, వారి వెనుక ఎవరు ఉన్నారో వెలికి తీయాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులో నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్షలు పడాలని, హోం మంత్రి తక్షణం స్పందించాలని, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

మైక్రో ఫైనాన్స్ సంస్థలతో పాటు కాల్‌మనీ నిర్వాహకులపై ప్రభుత్వం యుద్ధ స్థాయిలో చర్యలు తీసుకోవాలని డా. రాయవరపు సత్యభామ డిమాండ్ చేశారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0