వర్మ–ముద్రగడ భేటీ
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అలజడి మొదలైంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలవడం సాధారణ పరామర్శగా కనిపించినా, లోతుగా చూస్తే అది పెద్ద రాజకీయ సంకేతం అన్నట్టే ఉంది. ముద్రగడ ఇటీవల అనారోగ్యంతో బాధపడి చికిత్స అనంతరం కిర్లంపూడి స్వగృహానికి చేరుకున్నారు. వర్మ వెళ్లి ఆయన ఆరోగ్యం అడిగి తెలుసుకోవడం సహజమే. కానీ వర్మ చేయిపట్టుకుని బయటకు రావడం, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చుట్టూ విస్తరిస్తున్న ఊహాగానాలు రాజకీయ వాతావరణాన్ని కదిలిస్తున్నాయి.
వర్మ అసంతృప్తి – పెరుగుతున్న గుసగుసలు
జనసేన–టీడీపీ కూటమి విజయానికి వర్మ చేసిన త్యాగం చిన్నది కాదు. ఆయన తన పోటీని విరమించి, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం బహిరంగంగా కృషి చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకే కాకుండా ఆయన అనుచరులకు కూడా తగిన గౌరవం ఇవ్వలేదనే భావన బలపడింది. ముఖ్యంగా పదవుల కేటాయింపులో వర్మ శిబిరం పూర్తిగా విస్మరిం చబడిందనే ఆరోపణలు ఉన్నాయి. జనసేనలోనూ పదవులు అన్నియు ఒకే వ్యక్తికి కట్ట బెట్టడం అనేకమందిలో ఆగ్రహం రేపింది. ఈ అసంతృప్తి కేవలం జనసేనకే పరిమితం కాకుండా, టీడీపీ వర్గాల్లోనూ వినిపిస్తోంది.
అదే సమయంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు... వర్మ గౌరవానికి దెబ్బతీశాయి. మౌనం వహిస్తున్నప్పటికీ, వర్మలోని అసహనం, ఆయన అనుచరులలోని ఆగ్రహం ఇప్పుడు బహిర్గత మవుతోంది.
జనసేనలో విభేదాలు – కూటమిలో చీలిక?
జనసేనలో పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై నేతలు, కార్యకర్తల మధ్యే విభేదాలు స్పష్టమవు తున్నాయి. వర్మ అభిమానులు, ఇతర జనసైనికులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసు కోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ విభేదాలు కూటమిలోనూ ప్రతిఫలిస్తుండటంతో, టీడీపీ–జనసేన మధ్య గ్యాప్ మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
ముద్రగడ శపథం – వర్మ వ్యూహం?
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అత్యంత ఘాటు వాదన ఏమిటంటే—“పవన్ గెలవకూడ దనే శపథం ముద్రగడ ఎప్పుడో చేసి పెట్టుకున్నారట.” పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు చరిత్రలో కనుమరుగైపోతుందని, తన కీర్తి కొట్టుకుపోతుందని ముద్రగడ భావించారంటారు. అందుకే “పవన్ ఓడిపోవడమే నా ధ్యేయం” అని ఆయన బహిరంగంగానే అన్నారని కూడా చర్చ ఉంది. పవన్ విజయానంతరం ముద్రగడ తన పేరును మార్చుకున్నారన్నది కూడా అదే ఆవేదన ఫలితమని కొందరు అంటున్నారు.
ఇక 2029 ఎన్నికల్లో తన కలను నిజం చేసుకోవాలంటే వర్మను వైసీపీలో చేర్చ డమే మార్గమని ముద్రగడ ముందుగానే వ్యూహం రచించారనే వాదన బలపడు తోంది. వర్మలో పెరుగుతున్న అసంతృప్తిని ఆయుధంగా మలచుకుని, కూటమికి గట్టి దెబ్బ ఇవ్వడమే ముద్రగడ ప్రణాళిక అని విశ్లేషకులు చెబుతున్నారు.
ముగింపు – కూటమి భవిష్యత్తే ప్రశ్నార్థకం
ఇక ప్రశ్న ఒక్కటే—ఇది నిజంగానే పరామర్శమా? లేక కూటమి రాజకీయాలను తారుమారు చేసే ఒక పెద్ద స్కెచ్చా? వర్మ అసంతృప్తి, జనసేనలో పదవుల వివాదం, టీడీపీతో పెరుగుతున్న దూరం ఇవ్వన్ని కలిపి కూటమి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు గట్టిగా మారుమ్రోగుతున్న మాట ఒక్కటే “వర్మ–ముద్రగడ వ్యూహం అమలైతే, 2029లో కూటమి అంతర్గత లెక్కలు మొత్తం మారిపోతాయా?” అన్నది ప్రశ్న
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
1
Wow
0