పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేస్తే అసలుకే మోసం.. రూ.40 కోట్లతో జంప్..

పైసా పైసా కూడబెట్టి.. చిట్టీలు కట్టి మోసపోయారు కొందరు అమాయకులు. ఓ వ్యాపారి చీటీల 40 కోట్లకు టోకరా వేసి.. కనిపించకుండా పోయాడని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో బాధితులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చీటీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. రూ.40 కోట్లతో చీటీల వ్యాపారి పరారయ్యాడు. ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చింతలపూడి వీర శంకరరావు… సుమారు 30 సంవత్సరాల క్రితం చిన్న చిన్న చీటీలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. క్రమంగా వ్యాపారస్తులు, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఐదు లక్షల నుంచి కోటి రూపాయల చీటీలను నడపడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్లతో స్నేహంగా ఉంటూ చీటీలు కట్టించాడు. దీంతో చాలాకాలంగా ఈ వ్యాపారం నిర్వహించడంతో.. చాలా మంది వీర శంకరరావును నమ్మి చీటీలు వేశారు.
అయితే, చీటీ కాలపరిమితి పూర్తయిన వారికి కూడా వడ్డీతో సహా సొమ్మును తిరిగి చెల్లించకుండా అందరినీ మోసం చేశాడు. గత నెల 28వ తేదీన తన భార్య, పిల్లలతో సహా పరారయ్యాడు. బాధితులు డబ్బు కోసం ఇంటికి రాగా తాళం వేసి కనిపించింది. వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో మోసపోయిననట్లు గుర్తించారు బాధితులు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో లబోదిబోమంటున్నారు.
గత కొద్ది నెలలుగా చీటీలు వేసి, తమ డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మబలికి, తీరా సమయం వచ్చాక కుటుంబం అంతా డబ్బులతో పరారయ్యారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారి కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులే ఉన్నారు.
What's Your Reaction?






