జనసేన కార్యకర్తలపై టీడీపీ దాడి – కూటమిలో అసంతృప్తి బహిర్గతం

తూర్పుగోదావరి జిల్లా , కొవ్వూరులో జనసేన కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం కూటమి అంతర్గత విభేదాలకు నిదర్శనంగా మారింది. కూటమిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాయిలో సఖ్యత ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా వేరేలా ఉందని ఈ ఘటన స్పష్టం చేసింది.
నామినేటెడ్ పదవులు కేటాయించకపోవడం, ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస గౌరవం ఇవ్వకపోవడం వంటి అంశాలపై జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవ్వూరులో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమక్షంలో జరిగిన కూటమి సమావేశంలో ఈ అంశాలు ప్రస్తావించగా, టీడీపీ నాయకులకు కోపం వచ్చింది. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన జనసేన నాయకులపై టీడీపీ శ్రేణులు దారి కాచి నడిరోడ్డుపై దాడి చేశారు.
భౌతిక దాడులపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ డీఎస్సీ దేవకుమార్ జోక్యం చేసుకుని దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి కొంత సద్దుమణిగినా, కూటమిలో జనసేన శ్రేణులు ఎదుర్కొంటున్న అవమానాలు, గౌరవలేమి అంశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్టే పరిస్థితి ఉందని జనసేన నాయకులు వాపోవడం, కూటమిలో అసంతృప్తి ఎంతగా పెరిగిందో తెలియజేస్తోంది. పై స్థాయిలో సఖ్యత ఉన్నా, క్షేత్రస్థాయిలో విభేదాలు, దాడులు కొనసాగితే పొత్తు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన శ్రేణుల్లో కనిపిస్తోంది.
What's Your Reaction?






