ఆ చట్టం ఆమోదం పొందితే.. పిఎం, సిఎం అయినా పదవిని కోల్పోవాల్సిందే

గయా : త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం బీహార్ పర్యటనకు వెళ్లారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద కట్టిన ఇళ్లకు నేడు గహ ప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గయాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ పథకం కింద 12 వేల మంది లబ్ధిదారులు, అర్బన్ పథకం కింద 4వేల మంది లబ్ధిదారులు ఉన్నారు అని ఆయన అన్నారు. బీహార్ చాణక్యుడు, చంద్రగుప్తుడు.. ఏలిన ప్రదేశం అని కీర్తించారు. అన్ని సమయాల్లోనూ దేశానికి వెన్నుముకగా బీహార్ నిలిచిందన్నారు. ఇక్కడ తీసుకున్న దీక్షలు ఈ దేశాన్ని బలోపేతం చేశాయి. వధా కాలేదన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉగ్రవాదులను అణిచివేస్తామని ఇక్కడ నుంచే పేర్కొన్నట్లు చెప్పారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరిందని.. దాన్ని ప్రపంచం కూడా ప్రత్యక్షంగా చూసిందన్నారు.
ఈ సభలో మోడీ ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగిని 50 గంటల పాటు జైలులో వేస్తే, అప్పుడు ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నాడు. అతను ఓ డ్రైవర్ అయినా, క్లర్క్ అయినా, ప్యూన్ అయినా .. జాబ్ పోతోంది. కానీ సిఎం, మంత్రులు.. జైలులోనే ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గతంలో కొందరు జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేసేవారు. జైలు నుంచే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చేవారు. ఒక ప్రజానేతకు అటువంటి వ్యక్తిత్వం ఉంటే, అప్పుడు మనం అవినీతిని ఎలా ఎదుర్కుంటామని ప్రధాని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్‌డిఎ ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసింది. ఆ చట్ట పరిధిలోకి ప్రధానమంత్రి కూడా వస్తారు. ఒకవేళ ఆ చట్టం ఆమోదం పొందితే, అప్పుడు జైలులో ఉన్న ప్రధాని అయినా, సిఎం అయినా.. 31వ రోజు తన పదవిని కోల్పోవాల్సిందే’ అని అన్నారు.
ఆర్‌జెడి పాలన సమయంలో గయాజీ లాంటి పట్టణాలు చీకట్లోకి వెళ్లినట్లు మోడీ ఆరోపించారు. ఎన్నో తరాల నుంచి ప్రజలు ఇక్కడ నుంచి వలస వెళ్లినట్లు చెప్పారు. బీహారీ ప్రజలను ఆర్‌జెడి కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలు, బాధలు, గౌరవమర్యాదల గురించి ప్రతిపక్షాలు ఆలోచించడం లేదన్నారు. బీహార్ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్‌డిఎ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోందని మోడీ చెప్పారు.
What's Your Reaction?






