వీధికుక్కలపై గతంలో ఇచ్చిన తీర్పుని సవరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : వీధికుక్కలపై గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం సవరించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో ఆరు నుండి ఎనిమిది వారాల్లోపు వీధి కుక్కలను నిర్బంధించి షెల్టర్లకు తరలించాలని ఆగస్ట్ 11న సుప్రీంకోర్టు సుమోటోగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ తీర్పును సవరిస్తూ.. వీధికుక్కలను స్టెరిలైజేషన్, నులిపురుగుల నిర్మూలన మరియు ఇమ్యునైజేషన్ నిర్వహించిన అనంతరం వాటిని ఎక్కడి నుండి తీసుకువచ్చారో ఆ ప్రాంతాల్లోనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే రేబిస్ సోకిన లేదా విపరీతంగా ప్రవర్తించే కుక్కలకు ఈ ఉత్తర్వులు వర్తించవని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అటువంటి కుక్కలకు స్టెరిలైజేషన్ మరియు టీకాలు వేయాలని, ప్రత్యేక షెల్టర్స్‌లో ఉంచాలని ఆదేశించింది.
వీధి కుక్కల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిర్దిష్ట మునిసిపల్ వార్డులో ఆహారం అందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్ ఆదేశించారు. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే ఆహారం ఇవ్వాలని సూచిస్తూ నోటీసు బోర్డులు ఉంచాలని తెలిపారు. వీధుల్లో ఆహారం పెట్టేందుకు అనుమతి లేదని, ఈ ఆదేశాలను ఉల్లంఘించి కుక్కలకు ఆహారం అందిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
వీధి కుక్కలకు నియంత్రణ లేకుండా ఆహారం అందించడం వలన అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. ఉల్లంఘించిన వారి వివరాలు తెలిపేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించింది. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత వ్యక్తులు లేదా ఎన్‌జిఓలపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జంతు ప్రేమికులు సంబంధిత మునిసిపల్ అధికారుల ద్వారా వీధికుక్కలను దత్తత తీసుకోవచ్చని, అయితే వాటిని వీధుల్లోకి రాకుండా చూసుకోవడం వారి బాధ్యత అని స్పష్టం చేసింది
What's Your Reaction?






